నాగోబా జాతరలో బోలి చేతో స్వేచ్ఛా విజ్ఞానం!

Translate this post

ఒక భాషలోని ప్రతి పదం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనుక ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజ గుర్తింపు చిరస్థాయిగా నిలవాలంటే, ఆ భాష కాలంతో పాటు ప్రయాణించాలి… నిరంతరం కొత్త పదాలను, కొత్త ధోరణులను కలుపుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. నేటి డిజిటల్ యుగంలో ఆ ప్రయాణానికి ఇంటర్నెట్ ఒక ప్రధానమైన వేదిక. ఆదివాసీ భాషలకు అలాంటి డిజిటల్ వేదికను పరిచయం చేయాలనే లక్ష్యంతో బోలి చేతో ఫౌండేషన్ ఈ సంవత్సరం నాగోబా జాతరలో ఒక ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

              ప్రతి ఏడాది నాగోబా జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, భాషాభిమానులు, సందర్శకులు తరలి వస్తుంటారు. ఇది కేవలం భక్తి, సంస్కృతుల సమ్మేళనం మాత్రమే కాదు… కొత్త ఆలోచనలను సమాజానికి పరిచయం చేసే ఒక విశిష్టమైన వేదిక. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆదివాసీ భాషలను స్వేచ్ఛా విజ్ఞాన వేదికలతో అనుసంధానించే లక్ష్యంతో బోలి చేతో ఫౌండేషన్ ఈ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

             ఈ స్టాల్ చాలా మందికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ‘మన మాతృభాషలో కూడా వికీపీడియాలో రాయవచ్చా?’, ‘మన భాషకు కూడా ఆన్‌లైన్ నిఘంటువు ఉండొచ్చా?’ అనే ఆశ్చర్యం సందర్శకుల కళ్లలో కనిపించింది. గోండి, కొలామీ భాషలను డిజిటల్ ప్రపంచంలో భద్రపరచడం ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

             స్టాల్‌కు వచ్చిన వారితో కేవలం మాట్లాడి వివరించడం మాత్రమే కాదు, వారినే స్వేచ్ఛా విజ్ఞాన ప్రపంచంలోకి ఆహ్వానించాం. గోండి విక్షనరీలో పదాలను నమోదు చేయడం, గోండి, కొలామీ వికీపీడియాల్లో వ్యాసాలు రూపొందించడం, వికీపీడియా ఖాతా సృష్టించడం వంటి అంశాలను ప్రత్యక్షంగా చూపిస్తూ శిక్షణ ఇచ్చాం. దీంతో తమ భాష అభివృద్ధిలో తామూ భాగస్వాములు కావచ్చనే నమ్మకం వారిలో పెరిగింది.

              స్టాల్‌కు వచ్చిన స్పందన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అనేక మంది ఆదివాసీ యువతీ యువకులు, భాషాభిమానులు అక్కడికక్కడే వికీపీడియా ఖాతాలను సృష్టించి, తమ మాతృభాషలో రచనలు చేయడానికి ముందుకు వచ్చారు. తమ భాష కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే స్వేచ్ఛా విజ్ఞాన వేదికల్లో చోటు సంపాదించగలదనే విషయాన్ని తెలుసుకుని వారు వ్యక్తం చేసిన ఆనందం మా ప్రయత్నానికి లభించిన అతిపెద్ద గుర్తింపు.

             అయితే, మా ప్రయాణం నాగోబా జాతరతో ముగియలేదు. జాతరలో ఏర్పడిన పరిచయాలను కొనసాగిస్తూ, కొత్త వాలంటీర్లను తీర్చిదిద్దుతూ, గోండి, కొలామీ వంటి ఆదివాసీ భాషల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ భాషాభిమానులను స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నాం. ఈ కృషి ఫలితంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వాలంటీర్లు గోండి విక్షనరీ, గోండి వికీపీడియా అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటున్నారు.

           భాషను భవిష్యత్ తరాలకు అందించాలంటే మౌఖికంగా మాత్రమే కొనసాగిస్తే సరిపోదు… దాన్ని డిజిటల్ ప్రపంచంలోనూ సజీవంగా ఉంచాలి. నాగోబా జాతరలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ఆ దిశగా వేసిన ఒక గొప్ప అడుగు. కానీ ఆ అడుగు ఎంతో మంది కొత్త వాలంటీర్లను, కొత్త ఆశలను, కొత్త అవకాశాలను స్వేచ్ఛా విజ్ఞాన ప్రపంచానికి పరిచయం చేసింది.

           ప్రతి భాషకు డిజిటల్ ప్రపంచంలో స్థానం ఉండాలి. ప్రతి సమాజం తన భాషలోనే విజ్ఞానాన్ని సృష్టించే అవకాశం పొందాలి. ఇదే బోలి చేతో లక్ష్యం.  అదే మా బాధ్యత.

Can you help us translate this article?

In order for this article to reach as many people as possible we would like your help. Can you translate this article to get the message out?